: ఆమ్లెట్ వేస్తే... ప్లాస్టిక్ ముద్ద తయారైంది....కటకటాలు లెక్కిస్తున్న దుకాణదారు!
చైనాలో ప్లాస్టిక్ గుడ్లు, బియ్యం, క్యాబేజీ వంటివి తయారై భారతీయ మార్కెట్ ను ముంచెత్తుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారం వాస్తవమని నిరూపించే ఘటన కోల్ కతాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే...కోల్ కతాలోని పార్క్ సర్కస్ మార్కెట్ వద్ద షమీమ్ అన్సారీ అనే వ్యక్తి షాపు నిర్వహిస్తున్నాడు. అతని దుకాణం వద్ద అనిత కుమార్ అనే మహిళ గుడ్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లింది. వంట చేసే క్రమంలో గుడ్డుతో ఆమ్లెట్ వేసే ప్రయత్నం చేయగా, పెనం మీద వేయగానే గుడ్డు ప్లాస్టిక్ లా గట్టిపడింది.
దీంతో అనుమానం వచ్చిన ఆమె దానిని నిర్ధారించుకునేందుకు అగ్గిపుల్లతో దానిని వెలిగించగా, అది అంటుకుంది. దీంతో ఆమె కరయా పోలీస్ స్టేషన్ లో దుకాణదారుపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు షమీమ్ అన్సారీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తాను 1.15 లక్షల రూపాయలు చెల్లించి హోల్ సేల్ వ్యాపారి నుంచి గుడ్లను కొనుగోలు చేశానని వివరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ కూడా దీనిపై విచారణ ప్రారంభించింది.