: ఆయేషా కేసును మహిళా కమిషన్ తరపున విచారిస్తాం: నన్నపనేని రాజకుమారి
విజయవాడలో బీఫార్మసీ చేస్తూ హత్యకు గురైన ఆయేషా మీరా కేసుపై మహిళా కమిషన్ తరపున విచారణ చేస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ, ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఆయేషా కేసులో అసలు దోషులను ఎవరు దాచారు? ఎందుకు దాచాల్సి వచ్చింది? ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఘనులెవరు? వంటి వివరాలు తెలియాల్సి ఉందని ఆమె చెప్పారు. అప్పటి హోం మినిస్టర్ నుంచి దర్యాప్తు చేసిన పోలీసుల వరకు అందర్నీ విచారించాలని, అలా చేస్తే కానీ నిజాలు నిగ్గుతేలవని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, ఈ కేసులో నిందితుడు సత్యంబాబుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే అతనికి నష్టపరిహారం పెంచాలని ప్రభుత్వాన్ని కోరతామని ఆమె తెలిపారు.