: పోలీసు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తొట్ట తొలి ట్రాన్స్ జెండర్ సబ్ ఇన్ స్పెక్టర్
పేరు కె.ప్రితికా యాషిని. వయసు 25 ఏళ్లు. ఈమె లింగమార్పిడి శస్త్రచికిత్స ద్వారా పురుషుడి నుంచి స్త్రీగా మారిన వ్యక్తి. అసలు విషయం ఏమిటంటే ఈమె దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ గా అవతరించింది. నేటితో తమిళనాడు పోలీసు అకాడమీలో ఏడాది శిక్షణను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి పళనిస్వామి నుంచి సర్టిఫికెట్ స్వీకరించింది.
వందలూర్ లోని ఊనమన్ చెర్రీలో ఉన్న పోలీసు అకాడమీలో ఈ రోజు పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. మొత్తం 1,028 మంది పోలీసు శిక్షణ పూర్తి చేసుకోగా, వారందరికీ ముఖ్యమంత్రి సర్టిఫికెట్లను ప్రదానం చేసి ప్రజలతో స్నేహంగా మసలుకోవాలని, అదే సమయంలో సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ట్రాన్స్ జెండర్ అయిన ప్రితికా యాషిని తమిళనాడు యూనిఫార్మ్ డ్ బోర్డు పరీక్షలు రాసేందుకు గతంలో న్యాయపోరాటం చేసింది. సబ్ ఇన్ స్పెక్టర్ గా ఎంపికయ్యేందుకు ఆమె అర్హురాలేనని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రితికా కల సాకారం అయింది.