: రేపటి నుంచి పూర్తి స్థాయిలో రవాణా నిలిపివేస్తాం: లారీ యజమానుల హెచ్చరిక
తమ డిమాండ్ల సాధన కోసం లారీ యజమానులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరింది. సరుకు, నిత్యావసరాల రవాణా నిలిచిపోవడంతో పరిస్థితి తీవ్రతరం అవుతోంది. సమ్మె కారణంగా కూరగాయలు, నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. బీమా ప్రీమియం, టోల్ రుసుములు తగ్గించాలని, సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న డిమాండ్లతో దక్షిణ భారత లారీ యజమానుల సంఘం నిరవధిక సమ్మెను చేపట్టిన విషయం తెలిసే ఉంటుంది. వీరి సమ్మె కారణంగా ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో సుమారు 15 లక్షల లారీలు మూడు రోజులుగా నిలిచిపోయాయి.
దీంతో హోల్ సేల్ మార్కెట్లకు వచ్చే సరుకుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే నిత్యావసరాల ధరలు భగ్గుమంటాయన్న ఆందోళన కనిపిస్తోంది. కాగా, తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని తెలంగాణ లారీ యజమానుల సంఘం స్పష్టం చేసింది. రేపటి నుంచి పూర్తి స్థాయిలో రవాణా నిలిపివేస్తామని హెచ్చరించింది. ఔషధాలు, పాల రవాణాకు సమ్మె నుంచి లారీ యజమానులు మినహాయింపు కల్పించిన విషయం గుర్తుండే ఉంటుంది.