: ఉత్తరప్రదేశ్ లో వర్షం కురిస్తే తెలంగాణలో గొడుగు పడుతున్నారు!: బీజేపీపై ఎంపీ కవిత సెటైర్
‘దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టుగా’ కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని నిజామాబాద్ ఎంపీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో విలేకరులతో ఈ రోజు ఆమె మాట్లాడుతూ, రైల్వే పనులు తమ హయాంలోనే అయ్యాయని, తమ ప్రభుత్వాల దయ వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకోవడం సరికాదని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చింది బ్రిటిష్ వారైనప్పటికీ, సాధించింది మాత్రం గాంధీజీ అని అందరూ చెప్పుకుంటారని, ఎలిజబెత్ రాణి గురించి ఎవరూ చెప్పుకోరని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై కూడా ఆమె విమర్శల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్ లో వర్షం కురిస్తే తెలంగాణలో గొడుగు పడుతున్నారని, ఢిల్లీ రాజకీయం ఢిల్లీలోనే నడుస్తుందని, గల్లీ రాజకీయం గల్లీలో నడుస్తుందని కవిత బీజేపీపై సెటైర్ వేశారు.