: ఎంపీ గైక్వాడ్ ఎత్తులు... ఎయిరిండియా చేతిలో చిత్తు!


శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ను విమానయాన సంస్థలు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానంలో ప్రయాణించేందుకు ఆయన వేస్తున్న ఎత్తులను ఎయిరిండియా ఉన్నతాధికారి ఒకరు వివరించారు. విమానం ఎక్కేందుకు ఆయన తన పేరు, హోదా, ఊరు.. ఇలా ఏది పడితే అది మారుస్తూ టికెట్లు బుక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన వేసిన ఎత్తుగడలన్నీ విమానయాన సంస్థల ముందు చిత్తయ్యాయి. పూణే నుంచి టికెట్ తీసుకోవాల్సిన ఆయన తొలుత ముంబై నుంచి ఢిల్లీకి టికెట్ తీశారు. దానిని పసిగట్టి రద్దు చేశారు.

దీంతో మూడు రోజుల క్రితం హైదరాబాదు నుంచి ఢిల్లీకి టికెట్ తీశారు. దీనిని కూడా విమానయాన సంస్థలు పసిగట్టేశాయి. బుధవారం నాగ్ పూర్-ముంబై-ఢిల్లీ విమానంలో టికెట్ కోసం ప్రయత్నించారు. దీనిని కూడా విమానయాన సంస్థలు పసిగట్టేశాయి. రవీంద్ర గైక్వాడ్, ఆర్.గైక్వాడ్, ప్రొఫెసర్ వి. రవీంద్ర గైక్వాడ్, ప్రొఫెసర్ రవీంద్ర గైక్వాడ్ అంటూ పలు పేర్లతో ఆయన టికెట్ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఎయిర్ ఇండియా పార్లమెంటు విడుదల చేసిన అన్ని ట్రావెల్ కూపన్లపై నిఘా పెట్టి, ఆయనను విజయవంతంగా అడ్డుకున్నట్టు తెలిపారు. మరోవైపు ఎయిరిండియా ఉద్యోగి తనకు క్షమాపణలు చెప్పాలని గైక్వాడ్ డిమాండ్ చేస్తుండడం విశేషం! 

  • Loading...

More Telugu News