: ఇక మినిస్టర్ అఖిలప్రియ... శాఖపైనే సస్పెన్స్!
ఎల్లుండి జరిగే ఏపీ మంత్రి వర్గ విస్తరణలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ పేరు 99 శాతం ఖాయమైంది. ఏదైనా అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప, ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని, ఆపై ప్రస్తుత మంత్రివర్గంలో అతి చిన్న వయస్కురాలిగా ఆమె రికార్డును సృష్టిస్తారని తెలుగుదేశం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆమెకు ఇచ్చే శాఖ ఏంటన్న విషయమే ప్రస్తుతం సస్పెన్సని, ఆమె మినిస్టర్ కావడం ఖాయమని అంటున్నాయి.
కాగా, 2014లో కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మూడింట మాత్రమే గెలుపొందిన తెలుగుదేశం, 2019లో జరిగే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదపగా, గత సంవత్సరం జనవరిలో నంద్యాల ఎమ్మెల్యే, వైకాపా టికెట్ పై గెలిచిన భూమా, తన కుమార్తె సహా టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. టీడీపీలోకి వస్తున్న సమయంలోనే భూమాకు మంత్రి పదవిని ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే, అప్పటి నుంచి విస్తరణ మాత్రం జరగలేదు. తాను మంత్రిని కావాలన్న కోరిక తీరకుండానే భూమా మరణించిన నేపథ్యంలోనే అఖిలప్రియకు ఆ చాన్స్ ఇవ్వాలని చంద్రబాబు గట్టిగా నిర్ణయించుకున్నారని టీడీపీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.