: అంపశయ్య మీద ఉన్న సినిమా పాటల సాహిత్యాన్ని కీరవాణిగారే కాపాడగలరు!: భాస్కరభట్ల వ్యంగ్యం
'బాహుబలి ది కన్ క్లూజన్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముందు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతుండగా, కీరవాణికి ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల తాజాగా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ట్విట్టర్ లో కీరవాణి ‘తెలుగులో బుర్రతక్కువ దర్శకులు పెరిగిపోయారు... ఇక గీత రచయితల విషయానికి వస్తే వేటూరి సుందరరామ్మూర్తి చనిపోయిన తర్వాత, సిరివెన్నెల సీతారామశాస్ర్తి పాటలు రాయడం తగ్గించిన తర్వాత తెలుగు పాట అంపశయ్య ఎక్కింది’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిని దర్శకులు సీరియస్ గా తీసుకోలేదు కానీ, గీత రచయితలు మాత్రం సీరియస్ గా తీసుకున్నారు.
ప్రముఖ గీత రచయిత భాస్కరభట్ల దీనికి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘అంపశయ్య మీద ఉన్న సినిమా పాటల సాహిత్యాన్ని కీరవాణిగారే కాపాడగలరు. 'అయిదే నిమిషాలైతే అది సరిపోద్ది' (‘విక్రమార్కుడు’ సినిమా కోసం కీరవాణి రాసిన ఓ పాటలోని లైన్)...' అంటూ ట్వీట్ చేస్తూ వ్యంగ్యాన్ని ప్రదర్శించాడు. 'ఆయన స్వీయ సంగీత దర్శకత్వంలోనే కాకుండా వేరే సంగీత దర్శకులకీ పాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నా. వేటూరి, సిరివెన్నెల తర్వాత నాకు బాగా నచ్చిన పాటల రచయిత కీరవాణిగారేన’ని మరింత వ్యంగ్యాన్ని జోడించాడు.
మరో గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఐఫా అవార్డుల సందర్భంగా దీనిపై స్పందిస్తూ... ‘మంచి సందర్భం ఉంటే ఇప్పటి గీత రచయితలు కూడా అద్భుతంగా రాయగలరు. చెత్త సన్నివేశం ఇస్తే సిరివెన్నెల కూడా చెత్తగానే రాస్తార’ని అన్నాడు. కాగా, ఆ వేడుకలో ‘జనతాగ్యారేజ్’ సినిమాలోని ‘ప్రణామం’ పాటకు ఉత్తమ గీత రచయితగా ఆయన అవార్డు అందుకున్నాడు.
వేటూరి, సిరివెన్నెల తరువాత నాకు బాగా నచ్చిన పాటల రచయిత కీరవాణి గారే!
— bhaskarabhatla (@bhaskarabhatla) March 26, 2017