: కళ్లలో భయం, పాలిపోయిన ముఖంతో కోర్టు బోనులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు!
తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పదవీచ్యుతురాలైన దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయాన్ కోర్టుకు హాజరయ్యారు. కంటి నిండా భయం, ఏం జరుగుతుందోనన్న ఆందోళన, పాలిపోయిన ముఖంతో ఆమె బోనులో మౌనంగా నిలబడ్డారు. ఆమెను ఇంట్లో ఉంచి విచారణకు పిలవాలా? లేక అరెస్ట్ చేసి జైలుకు తరలించాలా? అన్న విషయాన్ని తేల్చేందుకు కోర్టు విచారణ చేపట్టింది.
తనను పలకరించిన వారితో సైతం ఒక్క మాట కూడా మాట్లాడని ఆమె, ఇద్దరు పోలీసుల ఎస్కార్ట్ నడుమ నిందితులు ధరించాల్సిన బ్యాడ్జ్ నంబర్ ఉన్న వైట్ కోటుతో కోర్టుకు హాజరయ్యారు. ఆమె ముడుపులు స్వీకరించారని, ప్రభుత్వ సమాచారాన్ని బయటి వ్యక్తులకు ఇచ్చారని, ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కేసును విచారించిన కమిటీ 1.20 లక్షల పేజీల నివేదికను కోర్టుకు అప్పగించగా, ఇక ఆమెను అరెస్ట్ చేయాలా? లేదా? అన్న విషయం నేడు తేలనుంది.