: ఇస్లాంలో చేరితే కేసు నుంచి విముక్తి... 42 మంది క్రిస్టియన్లకు పాక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫర్!
పాకిస్థాన్ లో మత సామరస్యం ఎంత 'గొప్ప'గా ఉంటుందనేదానికి నిదర్శనంగా తాజాగా ఓ ఘటన చోటు చేసుకుంది. అక్కడ మైనారిటీలుగా ఉన్న క్రిస్టయన్లలో 42 మంది హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసిన కేసులో వీరిపై కేసులు దాఖలయ్యాయి. 2015 మార్చిలో లాహోర్ లోని యుహనాబాద్ లో రెండు చర్చిలపై బాంబు దాడుల అనంతరం ఇద్దరు వ్యక్తులు హత్యకు గురికాగా, ఆ కేసులో వీరు నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. హత్యకు గురైన వారే బాంబు దాడుల వెనుక ఉన్నారని స్థానిక క్రిస్టియన్ల సందేహం.
ఈ కేసు విచారణ ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది (డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్) సయ్యద్ అనీష్ షా చేసిన ఆఫర్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. క్రిస్టియన్ మతాన్ని విడిచిపెట్టి ఇస్లాం మతంలోకి మారిపోతే కచ్చితంగా నిర్దోషులుగా బయటపడతారు అంటూ అనీష్ షా నిందితులకు ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని నిందితులకు న్యాయపరంగా సహాయ సహకారాలు అందిస్తున్న జోసెఫ్ ఫ్రాన్సిస్ అనే హక్కుల కార్యకర్త మీడియాకు వెల్లడించారు.