: అందుకే నన్ను సీఎంగా అమిత్ షా చేసిన ప్రతిపాదనకు ఒప్పుకున్నాను: యోగి ఆదిత్య నాథ్
రాందేవ్ పతంజలి యోగి మిషన్, ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన యోగ్ మహాత్సవ్-2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొని మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన అనంతరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే అంశంపై చర్చించిన తమ అధిష్ఠానం ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు తనకు ఫోన్ చేసిందని చెప్పారు. తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఫోన్‌లో తనతో ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయాలని తనతో చెప్పారని అన్నారు.
అప్పుడు తాను చాలా కన్ఫూజన్‌కు లోనయ్యానని ఆదిత్యనాథ్ చెప్పారు. తమ జాతీయాధ్యక్షుడి ప్రతిపాదనను తాను కాదంటే బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూసినట్టు అవుతుందని అన్నారు. అందుకే అమిత్ షా చేసిన ప్రతిపాదనకు తాను ఒప్పుకున్నానని చెప్పారు. ఉత్తరప్రదేశ్ తనకు చాలా బాగా తెలుసని, తాను రాష్ట్రం నుంచి పార్లమెంటు వరకూ ప్రయాణించానని చెప్పారు. ఆలయాలు, మఠాల్లో భిక్ష కూడా తీసుకునేవాడినని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిగా తాను యూపీని ముందుకు తీసుకెళతానని చెప్పారు.