: నువ్వేమో గుళ్ల తెర్వుకి పోతావుంటావు... ఆయనకేమో గర్వం!: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కొమురవెల్లి మల్లన్న గుడిలో మూలవిరాట్ విగ్రహం మట్టిది ఉందని, దానిని తొలగించి, గ్రానైట్ మూలవిరాట్ విగ్రహం పెడతానని ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడుతానని ఆయన గతంలో పేర్కొన్నారు. దీనిపై తనను కలిసిన ముత్తిరెడ్డిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘నీకు సంబంధం లేని విషయాల జోలికెందుకు పోతున్నవు? ఎవడన్నా.. గుళ్లతెర్వుకి పోతరా..! అసలు నీకు ఏం తెలుసని పోతున్నవు..? చేయడానికి పనులే లేనట్లు గుళ్ల ఎంబడి ఎందుకు పడుతున్నవు? నన్ను చూడు.. యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలనుకున్నా. మొత్తం చిన జీయర్ స్వామికి అప్పగించిన. ఖతమైపోయింది. ఆయనే అన్నీ చూసుకుంటుండు. మనం గుళ్ల తెర్వుకు పోవుడెందుకు!?’’ అని మండిపడ్డారు. అంతే కాకుండా ‘ఏం మనిషివయ్యా నువ్వు.. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? అసలు గుళ్ల తెర్వుకెందుకు పోతున్నవయ్యా.. ఓ పేపర్ లో పెద్ద పెద్ద అక్షరాలతో నీ ముచ్చటే వచ్చె.. ప్రభుత్వానికి, పార్టీకి బద్ నాం కాదా?’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంథని నియోకవర్గ ఎమ్మెల్యే పుట్టా మధు గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పుట్ట మధు కూడా తన దగ్గరికి ఎవరైనా వెళ్తే కసురుకుంటున్నాడు. నీ దగ్గరికి వచ్చినోళ్లందరికీ పని చేస్తవా.. చెయ్యవా అన్నది కాదు.. మంచిగ మాట్లాడితే ఏంబోతది? ఎమ్మెల్యేకాంగనే గర్వం, కోపం వస్తే ఎట్లా? అందుకే పుట్ట మధుకు నియోజకవర్గంలో మైనస్ అవుతోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు. మీరు వ్యక్తిగతంగా ఎలా ఉన్నా పర్లేదు కానీ, నియోజకవర్గాల్లో మీ వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించకూడదు కదా? అయన ముత్తిరెడ్డికి సూచించారు.