: నాసిరకం వస్తువు పంపిన ఫ్లిప్ కార్ట్ నుంచి ముక్కుపిండి ఫైన్ వసూలు చేసిన హైదరాబాదీ!
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.259 పెట్టి వస్తువును కొన్న ఓ వ్యక్తి తనకు అందిన ఆ ఐటెం నాసిరకంగా ఉందని తెలుసుకున్నాడు. దీంతో ఆయన వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించడంతో ఆ కంపెనీ రూ.15 వేలు చెల్లించుకుంది. పూర్తి వివరాలు చూస్తే... హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ అక్ ఇర్ఫానీ రెండు నెలల క్రితం ఫ్లిప్‌కార్ట్ లో ఓ స్మార్ట్‌ఫోన్ చార్జర్ ఆర్డర్ చేశాడు. అయితే, ఆ చార్జర్‌తో ఫోన్‌కు చార్జింగ్ పెట్టగానే ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. అతడి ఫోన్ లోపలి భాగం మొత్తం షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోయి పనికిరాకుండా పోయింది.
ఈ విషయంపై ఇర్ఫానీ ఫ్లిప్‌కార్ట్‌కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన ఆ సంస్థ ఆయనకు కావాలంటే చార్జర్‌ను మారుస్తామని, కానీ ఫోన్ కాలిపోయినందుకు, తమకు మాత్రం ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆ కంపెనీపై ఆయనకు చిర్రెత్తుకువచ్చింది. అనంతరం ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. విచారణకు వచ్చిన ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధులు.. తాము అమ్మేవారికి, కొనేవారికి నడుమ మధ్య వర్తిత్వం మాత్రమే చేస్తామని అన్నారు. తాము క్వాలిటీ ఉన్న వస్తువులనే అమ్ముతున్నామని చెప్పారు. అయితే, వారి వాదనతో సంతృప్తి చెందని వినియోగదారుల ఫోరం.. బాధితుడికి కొత్త చార్జర్‌తో పాటు అతని ఫోన్‌కు విలువైన మొత్తాన్ని చెల్లించాలని చెప్పింది. దీంతో ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇర్ఫానీ ఈ నగదును పొందాడు.