: 'రే' జయంతిని స్మరించుకున్న గూగుల్
భారతీయ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే 92వ జయంతిని నేడు ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ స్మరించుకుంది. 'రే' గౌరవార్ధంగా తన పేజ్ పై నలుపు, తెలుపుల డూడుల్ తో గౌరవించింది. ఈ డూడుల్ చిత్తరువును రే తొలిచిత్రం 'పథేర్ పాంచాలి' నుంచి తీసుకుంది. అందులో అపు, దుర్గా అనే రెండు పాత్రలు ఓ పొలంలో పరిగెడుతూ ఉంటాయి. 1955లో సత్యజిత్ రే రూపొందించిన 'పథేర్ పాంచాలి' 11 అంతర్జాతీయ అవార్డులు సహా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో 'ఉత్తమ మానవ డాక్యుమెంటరీ' అవార్డును గెలుచుకుంది.
ప్రపంచ గొప్ప దర్శకుల్లో ఒకరిగా రే గుర్తింపు పొందారు. పలు లఘు చిత్రాలు, డాక్యు మెంటరీలతో కలిపి మొత్తం 36 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. మే 2, 1921న కోల్ కతాలో బెంగాలీ కుటుంబంలో జన్నించిన రే కళలు, సాహిత్యంలో ప్రఖ్యాతిగాంచారు. ఈ క్రమంలో బాలలు, టీనేజ్ పిల్లలను ఉద్దేశించి 35 కథలు, నవలలు రచించారు. వాటిలో పిల్లలకోసం ఆయన సృష్టించిన 'ఫెలుదా', 'ప్రొఫెసర్ శంకు' వంటి పలు పాత్రలు ఎంతో ప్రాముఖ్యత పొందాయి.