: చెప్పుతో కొట్టిన ఎంపీని విమానం ఎక్కించేందుకు ఏకంగా నిబంధనల మార్పు!


విమానంలో ప్రయాణిస్తూ, చిన్న చిన్న గొడవలు చేసిన వారిపైనే కఠిన చర్యలు తీసుకుంటున్న వేళ, ఓ ఉన్నతాధికారిని చెప్పుతో కొట్టిన పార్లమెంట్ సభ్యుడిని మాత్రం చూసీ చూడనట్టు వదిలివేయాలని భావిస్తున్నారు. అది కూడా ఎవరో కాదు. సాక్షాత్తూ ప్రభుత్వమే. శివసేన ఎంపీ గైక్వాడ్ ను విమానాలు ఎక్కనీయబోమని ఎయిర్ లైన్స్ సంస్థలు స్పష్టం చేసిన వేళ, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా నిబంధనలు మార్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

ప్రయాణికులు, సిబ్బంది భద్రత విషయంలో రాజీపడబోమని చెబుతూనే, ఎంపీల నుంచి వచ్చిన ఒత్తిడితో నిబంధనల మార్పునకు విమానయాన మంత్రి అశోక గజపతి రాజు ఆదేశించినట్టు తెలుస్తోంది. నిన్న ఈ విషయాన్ని లోక్ సభలో ప్రస్తావించగా, స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం ఎంపీపై ఈ తరహా నిబంధనలు కూడదని, మరోసారి ఆలోచించాలని సూచించిన సంగతి తెలిసిందే. గైక్వాడ్ ది తప్పే అయినా, విమానాల్లో ఎక్కవద్దన్న నిషేధం తీవ్రమైనదని ఆయన్ను వెనకేసుకొచ్చారు. దీంతో కూటమిలోని మిగతా పార్టీలు, పలు ఇతర పార్టీల ఎంపీల నుంచి వినతులు రావడంతోనే గైక్వాడ్ ను విమానాల్లో ఎక్కించుకునేందుకు వీలుగా నిబంధనలు మార్చనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News