: అఖిలేష్ యాదవ్ ప్రాజెక్టుపై కొరడా ఝళిపించిన యోగి
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ... పాలనను ఉరుకులు పెట్టిస్తున్నారు. కేవలం 150 గంటల్లోనే 50 నిర్ణయాలు తీసుకుని, అధికారులకు దడ పుట్టించారు. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మారుస్తానని చెప్పిన యోగి... ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి అత్యంత కీలకమైన తొలి అడుగు వేశారు యోగి. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ పెట్ ప్రాజెక్ట్ అయిన 'గోమతి రివర్ ఫ్రంట్'పై ఆయన కొరడా ఝళిపించారు. ఆ ప్రాజెక్టు అనుమతులు, నిర్వహణ బాధ్యతలను చూస్తున్న అధికారులతో యోగి భేటీ అయ్యారు. సమీక్ష నిర్వహించారు.
ఈ ప్రాజెక్ట పేరిట అక్కడ నిర్మించిన ల్యాండ్ స్కేప్ లు, సైక్లింగ్ ట్రాక్ లు, ఇతర డిజైన్లు ఏవీ ఆదిత్యనాథ్ కు నచ్చలేదు. అంతేకాదు, ప్రాజెక్టుకు కేటాయించిన నిధులకు, పూర్తయిన పనులకు పొంత లేకుండా ఉండటం యోగికి కోపాన్ని తెప్పించింది. ప్రాజెక్టుకు రూ. 1500 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ. 1427 కోట్లు ఖర్చు చేశారు. కానీ, కేవలం 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో, డబ్బును ఎలా ఖర్చు చేశారో మొత్తం వివరాలు తనకు ఇవ్వాలంటూ యోగి ఆదేశించారు. అవినీతిని తాను ఎంతమాత్రం సహించనని మరోసారి స్పష్టం చేశారు. గోమతి ప్రాజెక్టును నమామి గంగే ప్రాజెక్టుకు అనుసంధానించి గంగా శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.