: వంద కిలోల బంగారు నాణెం అపహరణ.. బెర్లిన్ మ్యూజియంలో భారీ చోరీ
బెర్లిన్లోని బోడే మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.6.50 కోట్ల (10 లక్షల అమెరికన్ డాలర్లు) విలువైన వంద కిలోల బంగారు నాణెం అపహరణకు గురైంది. 2007లో రాయల్ కెనడియన్ మింట్ ఈ ‘బిగ్ మేపుల్ లీఫ్’ నాణేన్ని తయారుచేసింది. దీనిపై బ్రిటన్ రాణి ఎలిజెబెత్-2 బొమ్మను ముద్రించారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఇది అపహరణకు గురై ఉంటుందని భావిస్తున్నారు.
మ్యూజియం పక్కనే రైలు పట్టాలపై నిచ్చెన పడి ఉండడాన్ని గమనించిన జర్మన్ పోలీసులు.. దాని ద్వారానే దొంగలు మ్యూజియంలోకి ప్రవేశించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ‘యునెస్కో’ జాబితాలో ఉన్న బోడే మ్యూజియంలో ప్రపంచంలోనే అత్యధిక నాణేలు ఉన్నాయి. 10.2 లక్షల పురాతన గ్రీకు, 50 వేల రోమన్ నాణేలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాగా, బంగారు నాణెం చోరీ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.