: బండ్ల గణేష్ మనిషి కాడు.. తోడేలు లాంటి వాడు!: నటుడు సచిన్ జోషి ఆగ్రహం
తనను హతమార్చేందుకు గ్యాంగ్ స్టర్ నయీమ్ ను పురమాయించాడంటూ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల నటుడు సచిన్ జోషీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన సచిన్ ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టాడు. ‘బండ్ల గణేష్ మనిషి కాడు.. తోడేలు లాంటి వాడు. ఎవడినైతే నమ్మకూడదో, అటువంటి వాడితోనే వ్యాపారం చేశాను. రూ.27 కోట్ల దాకా ఇవ్వాలని, గణేష్ పై మొత్తం 14 కేసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అయితే, అతన్ని అరెస్టు చేసే పరిస్థితి వచ్చినప్పుడు.. గణేశ్ తండ్రి మా వద్దకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో, దయ తలచి వదిలేశాము’ అన్నాడు సచిన్.
కోర్టు ద్వారా వ్యవహారం తేల్చుకుందామని అనుకున్నానని, ‘ఒరేయ్ పండు’ సినిమా షూటింగ్ సమయంలో తనకు తినేందుకు తిండి కూడా లేదని బండ్ల గణేశ్ అనేవాడని.. ఆ తర్వాత నమ్మక ద్రోహం చేశాడని మండిపడ్డాడు. బండ్ల గణేశ్ పై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో తనపై ఆరోపణలు చేయడం తగదని సచిన్ జోషి అన్నాడు. కాగా, సచిన్ జోషి నటించిన ‘వీడెవడు’ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సచిన్ జోషి పైవిధంగా స్పందించాడు.