: మానవత్వాన్ని చాటుకుని, పది మంది భారతీయులను క్షమించిన పాకిస్థానీ.. తప్పిన మరణ శిక్ష!
షరియా (ముస్లిం చట్టం)ను పాటించే యూఏఈ లాంటి దేశాల్లో తప్పు చేసిన వారికి శిక్షపడితే వారు మళ్లీ ఆ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. బాధితుడి కుటుంబం నుంచి ఓ వ్యక్తిని ఒప్పించి.. తమకు శిక్ష పడకుండా కోర్టులో క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవడంతో దోషి ఆ శిక్షనుంచి తప్పించుకోవచ్చు. అయితే, దోషికి బాధితుడు క్షమాభిక్ష పెట్టడం చాలా అరుదు. కాగా, యూఏఈలోని అబుదాబిలో ఓ పాకిస్థానీ.. తన కొడుకు హత్య కేసులో దోషులుగా తేలిన పది మంది భారతీయులకు క్షమాభిక్ష పెట్టాలని కోరాడు. దీంతో దోషులు మరణ శిక్ష నుంచి తప్పించుకున్నారు.
వివరాల్లోకి వెళితే, 2015లో బాధితుడి కొడుకును ఈ పది మంది హత్య చేశారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ చేపట్టిన అక్కడి కోర్టు విచారణలో వారిని దోషులుగా తేల్చి అందరికీ మరణశిక్ష విధించింది. అయితే, తన కుమారుడిని కోల్పోయిన ముహమ్మద్ రియాజ్ అనే ఆ వ్యక్తి ఈ పది మంది భారతీయులను క్షమించాడు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ... తాను దురదృష్టవశాత్తు తన కొడుకును కోల్పోయానని, ఆ పది మందిని తాను క్షమించానని చెప్పాడు. నిజానికి అల్లానే వారి జీవితాలను కాపాడాడని వ్యాఖ్యానించాడు. మరణశిక్ష నుంచి తప్పించుకున్న దోషులు బాధిత కుటుంబానికి కొంత డబ్బు చెల్లించుకోనున్నారు.