: రిలయన్స్ ఇండస్ట్రీస్ పై సెబీ నిషేధం... 'బేర్'మన్న స్టాక్ మార్కెట్!
ఒక సంవత్సరం పాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో ట్రేడింగ్ లో పాల్గొనకుండా సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) విధించిన నిషేధం, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించింది. దీంతో రిలయన్స్ ఈక్విటీ విలువ 1.6 శాతం నష్టపోయి రూ. 1,266కు పడిపోగా, ఆ ప్రభావం స్టాక్ మార్కెట్ పైనా కనిపించింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు అర శాతం వరకూ దిగజారాయి.
కాగా, గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థగా ఉన్న రిలయన్స్ పెట్రోలియం సంస్థ చట్ట వ్యతిరేక విధానాల ద్వారా రూ. 447.27 కోట్ల ఆదాయాన్ని వెనకేసుకుందని సెబీ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. నవంబర్ 29, 2007 నాటికి ఈ సంస్థ ఈక్విటీపై ఉన్న ఓపెన్ పొజిషన్స్ ను 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని సెబీ ఆదేశించింది. కాగా, ఈ నిర్ణయంపై తమ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని, సెక్యూరిటీస్ అపిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయిస్తామని రిలయన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.