: ఆరాధన కేసులో ఆధారాలు లేవట!.. కేసును మూసేసిన పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరాధన సముదారియా (13) కేసులో ఆధారాలు లభించలేదంటూ పోలీసులు కేసును మూసేశారు. ఈ కేసులో ఎంత దర్యాప్తు చేసినా ఆధారాలు లభించలేదని, కాబట్టి కేసును మూసివేస్తున్నామంటూ సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు బాలల హక్కుల సంఘానికి నోటీసు ద్వారా తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఆరాధన 68 రోజుల పాటు ఉపవాసం ఉండి గతేడాది జూన్ 2న మృతి చెందింది.
బాలిక మృతిపై స్పందించిన బాలల హక్కుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పది నెలలపాటు విచారించినా ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. సుదీర్ఘంగా ఉపవాసం ఉండడం వల్లే బాలిక మృతి చెందిందని స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ తమకు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సంఘం అధ్యక్షురాలు అనురాధారావు పేర్కొన్నారు. పోలీసుల వైఖరిపై త్వరలో కోర్టును ఆశ్రయిస్తామని ఆమె పేర్కొన్నారు.