: వాళ్లొచ్చి క్షమాపణలు చెప్పారు... వివాదం ఇక ముగిసింది!: ఆర్టీఏ అధికారి సుబ్రహ్మణ్యం


ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమ వచ్చి క్షమాపణలు చెప్పారని విజయవాడ ఆర్టీఏ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, అవగాహనా రాహిత్యం కారణంగా నిన్న వారు అలా వ్యవహరించారని అన్నారు. ఆవేశంగా ఉన్నప్పుడు ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారని ఆయన చెప్పారు. తన సెక్యూరిటీ సిబ్బంది నిబద్ధతకు గర్వపడుతున్నానని ఆయన చెప్పారు. అలాగే తన డిపార్ట్ మెంట్ వ్యవహరించిన తీరుకు కూడా గర్విస్తున్నానని ఆయన చెప్పారు.

నిన్న ఆవేశం రేగే సమయంలో తమ ఉద్యోగులంతా నియంత్రణ పాటించారని ఆయన కితాబునిచ్చారు. ఒక యాక్సిడెంట్ విషయంలో బస్సు డ్రైవర్ దే తప్పని తేల్చడంతో వివాదం రేగిందని ఆయన చెప్పారు. బస్సులో సాంకేతిక లోపం లేదని తమ నిపుణులు తేల్చడంతో అవగాహనా లోపంతో నిన్న ఆ ఘటన చోటుచేసుకుందని అన్నారు. వారు క్షమాపణలు చెప్పిన తరువాత కూడా వివాదాన్ని రాజేయడం సరికాదని, ఈ వివాదం ఇంతటితో ముగిసిందని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News