: సిండికేట్ బ్యాంకులో రూ. 209 కోట్ల కుంభకోణం... రంగంలోకి సీబీఐ
ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంకులో రూ. 209 కోట్ల కుంభకోణం జరిగింది. జైపూర్ కు చెందిన ఓ ప్రముఖ బిల్డర్ కు మేలు చేసేందుకు నలుగురు ఉన్నతోద్యోగులు ఈ కుంభకోణానికి తెరలేపారు. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ, జైపూర్, అజ్మీర్ సిండికేట్ బ్యాంకు శాఖలపై దాడులు జరిపి అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఏకే తివారీ, ఆదర్శ మన్ చందాలతో పాటు మాజీ చీఫ్ మేనేజర్లు దేశ్ రాజ్ మీనా, సంతోష్ గుప్తాలపై కేసు నమోదు చేసింది.
వీరితో పాటు బిల్డర్ అనూప్ భార్తియా, చార్టెడ్ అకౌంటెంట్ భరత్, రియల్టర్ శంకర్ లాల్ ఖండేల్ వాల్ లపైనా ఆరోపణలు నమోదు చేసింది. వీరంతా కలిసి బ్యాంకుకు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి భారీ మొత్తంలో రుణాలను పొందారని, వీరికి బ్యాంకు అధికారులు తమ వంతు సహకారాన్ని అందించారని, దీని కారణంగా బ్యాంకుకు రూ. 209 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ తెలిపారు. బ్యాంకు ఇచ్చిన డబ్బును నిందితులు చట్ట వ్యతిరేక మార్గాల్లో ఇతర కంపెనీలకు తరలించారని వెల్లడించారు.