: ప్రజలకు చూపించాల్సింది బొమ్మలు కాదు: ఎమ్మెల్యే రోజా


సింగ‌పూర్‌ని త‌ల‌పించేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య‌ రాజ‌ధాని అమ‌రావ‌తి న‌గ‌రాన్ని నిర్మిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మ‌రో నాట‌కం ఆడారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడుతూ... చంద్ర‌బాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించి రాష్ట్ర‌ ప్రజలను మభ్యపెట్టార‌ని చెప్పారు. మాకీ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్ర‌భుత్వం ఇప్పుడు మరో సంస్థకు మార్చడమేంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు ఏక పక్షంగా నిర్ణ‌యం తీసుకొని రాజధానిని ఎంపిక చేశారని ఆమె అన్నారు.

ఆనాడు రాజధాని ఎంపిక విషయంలో ప్ర‌భుత్వం అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని రోజా నిల‌దీశారు. ప్ర‌జ‌ల‌ను మభ్య‌పెడుతూ చంద్ర‌బాబు ప్ర‌జ‌ల చెవిలో పూలు పెడుతున్నార‌ని ఆమె అన్నారు. ఏపీ న‌వ్య‌ రాజధానిలో చూసేందుకు ఓ చెట్టుకూడా లేదని, మ‌రోవైపు ఇక మహిళా మంత్రులు, ప్రతినిధులు వెళ్లేందుకు టాయిలెట్లు కూడా లేవ‌ని ఆమె ఆరోపించారు. అమ‌రావ‌తి నిర్మాణం అంటూ మొదట సింగపూర్‌ డిజైన్లను తీసుకొచ్చార‌ని, అనంత‌రం పొగ గొట్టాల డిజైన్లను తెచ్చారని, ఇప్పుడేమో ఫోస్టర్‌ సంస్థ డిజైన్లపై ప్రజంటేషన్‌ ఇస్తున్నారని ఆమె ధ్వ‌జ‌మెత్తారు.

మొద‌ట ఇచ్చిన రెండు గ్రాఫిక్‌లను పక్కనపెట్టి ఇప్పుడు మూడో గ్రాఫిక్‌ ను తీసుకొచ్చిన ప్ర‌భుత్వం దీన్న‌యినా ఖరారు చేస్తుందో లేదో అని రోజా అనుమానం వ్య‌క్తం చేశారు. శాస‌న‌స‌భ‌లో తాము రైతుల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేస్తోంటే, ప్ర‌భుత్వం మాత్రం ఇటువంటి  గ్రాఫిక్‌ డిజైన్ల పేరుతో సమయాన్ని వృథా చేస్తోంద‌ని ఆమె అన్నారు. రాష్ట్ర‌ ప్రజలకు చూపించాల్సింది బొమ్మలు కాదనీ, ఏపీలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే రాజధాని కావాలని ఆమె అన్నారు. శాశ్వత రాజధాని డిజైన్లను శాస‌న‌సభలో చూపించాల‌ని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News