: మగబిడ్డ కోసం భర్త అసభ్యకర వేధింపులు... భరించలేక భర్తను కడదేర్చిన భార్య!
మగబిడ్డ కావాలంటూ నీచంగా ప్రవర్తిస్తోన్న తన భర్తను ఓ మహిళ హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. సదరు మహిళను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన ఓ దంపతులకు ఒక కూతురు ఉంది. అయితే, తనకు మగబిడ్డ కావాలని తన భార్యను వేధించాడు భర్త. తన వారసత్వాన్ని, కుటుంబ వ్యాపారాన్ని మగబిడ్డే కొనసాగిస్తాడని, ఇందుకోసం తన సోదరుడితో గడపాల్సిందిగా ఆ భర్త ఆమెపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాడు.
అయితే, అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెను చితక్కొడుతూ.. ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిస్తానని బెదిరించాడు. అంతేగాక వేశ్యాగృహాలకు అమ్మేస్తానని అన్నాడు. పుట్టబోయేది ఆడబిడ్డే అని తెలుసుకుని, పలుసార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. చివరకు సహనం కోల్పోయిన ఆ మహిళ భర్తను చంపేయాలని నిర్ణయించుకుని, నిద్రమాత్రలు కలిపిన పానీయాన్ని తన భర్తకు ఇచ్చింది.
అనంతరం అతడు నిద్రపోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. ఉదయాన్నే పోలీసులకు ఫిర్యాదు చేసి తన భర్తను తమ ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా చంపేసి ఉండవచ్చని అసత్యాలు చెప్పింది. అయితే, ఆమెపై అనుమానం వచ్చిన పోలీసులు చివరికి ఆమే నిందితురాలని తేల్చారు. హత్య జరిగిన రోజు ఆ మహిళ సోదరుడు అక్కడికి వచ్చాడని అక్కడి సీసీ కెమెరాల ద్వారా కనుక్కున్నారు. చివరికి ఆమె నేరం ఒప్పుకోవడంతో.. ఆమె సోదరుడితో పాటు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.