: డ్రామా ఆడాడని తెలిసినా.. సాయం చేసిన సుష్మా స్వరాజ్!
విదేశాల్లో ఆపదలో ఉన్న భారతీయులను ఆదుకునేందుకు ఒక్క ట్వీటు దూరంలో ఉండే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఒక వ్యక్తి డ్రామా ఆడాడని తెలిసి కూడా ఆదుకునేందుకు ముందుకు వచ్చి, తన సహృదయతను చాటుకున్నారు. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... భారత్ కి చెందిన రాజీవ్ శర్మ అనే వ్యక్తి.. సెర్బియా దేశంలో ఉన్న తన సోదరుడు వినయ్ మహజన్ ను ఎవరో కిడ్నాప్ చేశారని, డబ్బివ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ తో ఒక వీడియోను కూడా పోస్టు చేశాడు. ఆ వీడియోలో చొక్కా లేకుండా ఉన్న ఓ వ్యక్తిని కట్టేసి కొడుతున్నట్లుగా ఉంది. దీంతో వేగంగా స్పందించిన సుష్మ స్వరాజ్ ఆ వీడియోను, వివరాలను సెర్బియాలోని భారత ఎంబసీకి పంపి.... వేగంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు.
దీంతో ఆగమేఘాల మీద స్పందించిన అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన, వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సుష్మాకు వివరించారు. దీంతో ఆమె తనకు ట్వీట్ చేసిన వ్యక్తికి జవాబిస్తూ... ‘రాజీవ్! నీ సోదరుడు అధికారుల సమక్షంలో క్షేమంగానే ఉన్నాడు. మరో విషయమేంటంటే, అతన్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నువ్వు పంపిన వీడియో నకిలీది. మీ తమ్ముడే కిడ్నాప్ అయినట్లు డ్రామా ఆడాడు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా సెర్బియాలో ఉన్న భారత దౌత్యాధికారులతో మాట్లాడాను. మీ తమ్ముడిని మార్చి 25న భారత్‌కు పంపిస్తామని చెప్పారు’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమె మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. తప్పుడు సమాచారంతో ఆమెను సంప్రదించవద్దని సలహా ఇస్తున్నారు.