: అడవి పంది మాంసం తినండి..!: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
అడవి పంది మాంసం తినండంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏజెన్సీ ప్రాంతమైన ఏటూర్ నాగారంలో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వకాలంలో మనుషులు అడవి పంది మాంసం తినేవారని.. బ్రాహ్మణ కల్చర్ వచ్చిన తర్వాత ఆహారపు అలవాట్లు మారాయని అన్నారు. ప్రస్తుత సమాజంలో దేవుళ్ల పేరుతో మాలలు వేస్తున్నారని, అది ట్రెండ్ లా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు.
అయితే తాను ఇంతవరకు అడవి పంది మాంసం తినలేదని, అమెరికాలో దానికి మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఇంకోసారి వచ్చినప్పుడు పెడితే తింటానని ఆయన చెప్పారు. అడవి పందిని చంపడం చట్టప్రకారం నేరం అవుతుందని కూడా భావించడం లేదని ఆయన పేర్కొన్నారు. కాగా, వన్యప్రాణుల జాబితాలో అడవి పందులు ఉండవని ఆ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.