: జగన్ ఏ పత్రాలు తెస్తున్నారో.. ఏం మ్యాజిక్ చేస్తున్నారో!: ఆరోపణలను తిప్పికొట్టిన ప్రత్తిపాటి
అగ్రిగోల్డ్ అంశంపై తనపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తిప్పికొట్టారు. ఈ రోజు ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత ఏ పత్రాలు తెస్తున్నారో.. ఏం మ్యాజిక్ చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. అగ్రిగోల్డ్‌కి సంబంధం లేని ఆస్తులను కూడా కొన్నట్లు చూపిస్తున్నారని చెప్పారు. వైసీపీ వాళ్లకు నకిలీ పత్రాలు చూపించడం ఓ అలవాటు అయిపోయిందని అన్నారు. తనకు అగ్రిగోల్డ్‌తో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలను జగన్ నిరూపించుకోలేకపోయాడని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయాలన్న ఉద్దేశం జగన్‌కు లేదని అన్నారు.
ఐటీ రిటర్న్స్ ప్రకారమే తాను భూములను కొన్నానని, ఆ భూములపై ఎన్నో అవాస్తవాలు, అసత్యాలను ప్రచారం చేస్తూ తనను తన కుటుంబాన్ని బజారుకి ఈడ్చడం జగన్ కి ఎంతవరకు న్యాయమని ప్రత్తిపాటి అన్నారు. ఉదయ్ దినకరన్ ఆ సంస్థకు డైరెక్టర్ మాత్రమేనని, దినకరన్ ఎకరాను రూ.3 లక్షలకు కొని, తమ కంపెనీకి 4 లక్షల రూపాయలకు అమ్మారని చెప్పారు. తాను రైతుల నుంచి కూడా నిబంధనల ప్రకారమే భూములు కొన్నానని అన్నారు. వాటిపైనే ప్రతిపక్ష సభ్యులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
తన క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. ఆరోపణలు రుజువు చేయలేక జగన్ శాసనసభ నుంచి పారిపోతున్నారని ఆయన అన్నారు. నిన్న పారిపోయారు.. ఈ రోజు కూడా పారిపోయారని ఎద్దేవా చేశారు. వారు అవాస్తవాలు, ఆరోపణలు చేస్తున్నా చంద్రబాబు నాయుడు వారి ఆరోపణలపై న్యాయ విచారణకు అంగీకారం తెలిపారని, అయితే జగన్ పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలని అన్నారు. హాయ్ లాండ్‌ని వేలానికి తీసుకురమ్మని కోరింది ముందు చంద్రబాబేనని, దానిపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రత్తిపాటి అన్నారు.