: భోఫోర్స్, స్పెక్ట్రం, కోల్ స్కాంల కంటే అగ్రిగోల్డ్ స్కాం అతి పెద్దది.. ఇంత కన్నా ఆధారాలు ఇంకేం కావాలి?: జగన్
అగ్రిగోల్డ్ అంశం గురించి వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఈ రోజు విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి ఆ భూములు అమ్మింది దినకరనేనని అన్నారు. దినకరన్ అగ్రిగోల్డ్ డైరెక్టర్గా 2010 నుంచి ఉన్నారని చెప్పారు. అన్ని అంశాలపై తాను సాక్ష్యాధారాలు బయటపెడుతుంటే తనను మాట్లాడనివ్వకుండా స్పీకర్ కోడెల శివప్రసాద్రావు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్యపేరిట భూమి ఉన్నట్లు ఉన్న పలు పత్రాలను జగన్ మీడియాకు చూపించారు. తాను ఆధారాలతో సహా చూపిస్తున్నానని అన్నారు. తనకు, ప్రత్తిపాటి పుల్లారావుకి మధ్య వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవని తెలిపారు.
ఈ స్కాంలో ఉన్నవారు ఎవరయినా సరే బాధితులకి న్యాయం జరగాల్సిందేనని జగన్ అన్నారు. అక్రమాల నిరూపణకు ఈ ఆధారాలు సరిపోవని మాట్లాడుతున్నారని, గతంలో దేశంలో జరిగిన స్కాంలలో ఆధారాలుగా ఏయే ఆధారాలు చూపించారని ఆయన ప్రశ్నించారు. ఇంత కన్నా ఆధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. భోఫోర్స్, స్పెక్ట్రం, కోల్ స్కాంల కంటే అగ్రిగోల్డ్ స్కాం అతిపెద్దదని అన్నారు. డిపాజిటర్లకు వారి సొమ్ము వారికి తిరిగి ఇవ్వాల్సిందేనని, ఇదే బాధితుల తరఫున తన డిమాండ్ అని అన్నారు. అగ్రిగోల్డ్ భూములను గద్దల్లా తన్నుకుపోయారని, ఆ గడ్డాల నుంచి ఆస్తులను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.