: ఈ అతిపెద్ద స్కాంలో మంత్రి ప్రత్తిపాటి అనే వ్య‌క్తి ఒక చిన్న చీమ లాంటి వారు: జ‌గ‌న్


అగ్రిగోల్డ్ లాంటి అతిపెద్ద స్కాంలో మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అనే వ్య‌క్తి ఒక చిన్న చీమ లాంటి వారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... 20ల‌క్ష‌ల మంది కుటుంబాల్లో క‌ష్టాలు నింపిన అతిపెద్ద స్కాం గురించి త‌న‌ను ఎందుకు మాట్లాడ‌నివ్వ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ స్కాంలో ఇంకా ఎంతో మంది పెద్ద‌మ‌నుషులు బ‌య‌ట‌కు రావాల‌ని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అంశాన్ని ప‌క్కదారి ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా తాను చేయాల్సిన ప‌నిచేస్తోంటే, టాపిక్ డైవ‌ర్ట్ చేస్తూ సవాలు విసురుతున్నారని జ‌గ‌న్ అన్నారు.

స‌భ‌లో ప్ర‌త్తిపాటి పుల్లారావ‌యినా ఉండాల‌ని, లేక తాన‌యినా ఉండాల‌ని స‌వాలు విసురుతున్నార‌ని జ‌గ‌న్ అన్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే ఇలాంటి స‌వాలు విసు‌రుతూ ఇష్యూపై మాట్లాడ‌నివ్వ‌క‌పోవ‌డ‌మేంట‌ని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల‌కి న్యాయం చేకూర్చాల‌న్న‌దే త‌న తాప‌త్ర‌య‌మ‌ని అన్నారు. వారికి న్యాయం జ‌ర‌గ‌డానికే తాను పోరాడుతున్నాన‌ని చెప్పారు. ఏపీ అసెంబ్లీ కౌర‌వ స‌భ‌ను త‌ల‌పించింద‌ని అన్నారు.

అగ్రిగోల్డ్ వేలంలోకి కొన్ని భూములు ఎందుకు రావ‌డం లేదని ప్ర‌శ్నించారు.  ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు అడ్డంగా దొరికార‌ని, ఆ వాయిస్ చంద్ర‌బాబుది కాద‌ని చంద్ర‌బాబు చెప్ప‌గలరా? అని అన్నారు. ఈ అంశంపై మాత్రం ఆయ‌న మాట్లాడ‌డం లేద‌ని అన్నారు. పార్టీ మారిన 21 మంది స‌భ్యుల స్థానాల్లో మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌ర‌ప‌గ‌ల‌రా? అని స‌వాలు విసిరారు. చంద్ర‌బాబుకి అస‌లు ప్ర‌జాస్వామ్యం అంటే ఏంటో తెలుసా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్షానికి స‌భ‌లో మాట్లాడే స‌మ‌యం ఇవ్వాలని హిత‌వు ప‌లికారు.

  • Loading...

More Telugu News