: నా భార్యతో కాఫీ తాగే అవకాశం లభించింది: నటుడు అనుపమ్ ఖేర్
బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, ఆయన భార్య తరచుగా కలుసుకోవడం కుదరట్లేదట. ఈ విషయాన్ని ఆయనే తెలిపారు. ఎందుకంటే, ఆయన భార్య కిరణ్ ఖేర్ చండీగఢ్ ఎంపీగా ఉన్నారు. దీంతో, తామిద్దరం కలిసేందుకు సమయం దొరకడం లేదని, కిరణ్ ఖేర్ తన నియోజకవర్గ పనుల్లో మునిగి తేలుతున్నారని చెప్పారు. అయితే, చండీగఢ్ లేదా ఢిల్లీలో కిరణ్ ఖేర్ ఉన్నప్పుడు మాత్రమే తామిద్దరం కలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ క్రమంలో ఈ రోజు తాను ఢిల్లీలోనే ఉన్నానని, తన భార్యతో కలిసి కాఫీ తాగే అవకాశం లభించిందని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిమిత్తం ఆమె ఢిల్లీలో ఉన్నందువల్లే ఆమెతో కాఫీ తాగే అవకాశం తనకు దొరికిందని అన్నారు. అయితే, ఈ రోజు రాత్రికి తాను ఢిల్లీ నుంచి వెళ్లాల్సి ఉందని, పరస్పరం అర్థం చేసుకుంటూ తాము ముందుకు సాగుతున్నామని విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ చెప్పుకొచ్చారు.