: పవన్ అభిమానులకు 'షాకింగ్ సీన్' చూపిస్తున్న థియేటర్ యాజమాన్యాలు!
"గవర్నమెంటు వారి ఉత్తర్వుల ప్రకారం టికెట్ రేట్లు పెంచబడినవి. 'కాటమరాయుడు' చిత్రం... బాల్కనీ రూ. 150, బెంచి రూ. 100, నేల రూ. 50"... ఇది నేడు ఉదయం పవన్ తాజా చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు వెళ్లిన అభిమానులకు కనిపిస్తున్న బోర్డులు. వాస్తవానికి బాల్కనీ రూ. 80 నుంచి నేల రూ. 20 వరకూ టికెట్ ధరలు ఉంటాయి. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం, కొత్త సినిమా వస్తే, ఈ ధరలను పెంచుకోవచ్చు. అయితే, పెంచుకోమని చెప్పారన్న ఒకే ఒక్క మాటను పట్టుకుని, గరిష్ఠంగా రూ. 150కి విక్రయించాల్సిన బాల్కనీ టికెట్లను రూ. 800 నుంచి రూ. 1000కి థియేటర్ కౌంటర్లలోనే అమ్మకాలకు ఉంచారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా అభిమానులు అధికంగా ఉన్న తణుకు, భీమవరం తదితర ప్రాంతాల్లో దాదాపు అన్ని చోట్ల ఈ చిత్రం విడుదల కాగా, థియేటర్ యాజమాన్యాలు తమను నిలువుదోపిడీ చేస్తున్నాయని అభిమానులు వాపోతున్నారు. పోలీసులు, రెవెన్యూ, సేల్ ట్యాక్స్ అధికారులు థియేటర్ల వైపు కూడా చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.