: పవన్ ను అనుకరిస్తూ పంచెకట్టు, జుబ్బాలలో అభిమానులు .. థియేటర్ల వద్ద సందడే సందడి!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రుతిహాసన్ జంటగా నటించిన కాటమరాయుడు చిత్రం ఈ రోజు విడుదలైంది. దీంతో, పవన్ అభిమానుల సందడి నెలకొంది. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం విడుదల అయిన థియేటర్ల వద్ద పవన్ అభిమానులు కొందరు తమ హీరోను అనుకరిస్తూ పంచెకట్టు, టీ షర్టులు ధరించి వచ్చారు. కాటమరాయుడు చిత్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు బ్లూ కలర్ జుబ్బా, పంచెకట్టుతో పవన్ కల్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. ఇదే తరహా డ్రెస్సుల్లో పవన్ అభిమానులు ఆయా థియేటర్ల వద్ద దర్శనమిస్తున్నారు.
అంతేకాకుండా, ఈ చిత్రంలో పంచెకట్టుతో కనపడే పవన్, చిలకపచ్చరంగులో ఉండే చిన్న టవల్ ను మెడపై ధరిస్తాడు. అదే రంగు టవల్ ను పవన్ ఫ్యాన్స్ తమ మెడలపై వేసుకుని అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆయా థియేటర్ల వద్ద డప్పులు మోగిస్తూ, బాణసంచా కాలుస్తూ పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.