: ఎంపీ రవీంద్ర గైక్వాడ్ జీవితం.. నేరాల మయం!
ఎయిర్ ఇండియా అధికారి సుకుమార్ ను చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ జీవితం నేరాలమయం. రాజకీయ నాయకుల నేర, ఆర్థిక వివరాలను పొందు పరిచే ‘మై నేత.ఇన్ ఫో’ పోర్టల్ ప్రకారం, ఆయనపై హత్య, దోపిడీ, బెదిరించడం వంటి కేసులు ఉన్నాయి. తాజాగా, ఎయిర్ ఇండియా అధికారిని చెప్పుతో కొట్టడంతో ఆయన మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. అయితే, గైక్వాడ్ ఈ విధమైన చర్యలకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు తలెత్తాయి.
ఈ విషయమై వివరణ ఇవ్వాలంటూ గైక్వాడ్ కు పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. ఇదిలా ఉండగా, రవీంద్ర గైక్వాడ్ ఎం.కామ్, బీ.ఎడ్. పూర్తి చేశారు. దయానంద్ మహా విద్యాలయ, లాతూర్ నుంచి 1982లో ఎం.కామ్ డిగ్రీ పొందారు. 1986లో అంబెజ్ గాయ్ లోని గవర్నమెంట్ కళాశాల నుంచి బీ.ఎడ్ పూర్తి చేశారు. గతంలో రెండు సార్లు మహారాష్ట్ర అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు. 2014లో ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా లోక్ సభకు ఎన్నికయ్యారు.