: ఇది పిరికితనమా.. భయపడడమా.. పారిపోవడమా?: వైసీపీని ఎద్దేవా చేసిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రేపటికి వాయిదా పడ్డ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, గతంలోనూ స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టారని, ఏమయిందని చంద్రబాబు ప్రశ్నించారు. అలా చేస్తే సభా సమయం వృథా చేయడం తప్పా ఒరిగేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. స్పీకర్‌పై చేసిన అసత్య ఆరోపణలు సభకు సంబంధించినవి కాదా? అని ఆయన ప్రశ్నించారు. స్పీకర్‌పై బయట ఆరోపణలు వచ్చినప్పటికీ శాసనసభలోనూ చర్చించవచ్చని ఆయన అన్నారు.
సాక్షి పత్రిక మీద కక్ష కట్టారని వస్తోన్న ఆరోపణలను చంద్రబాబు ఖండించారు. ఇటీవల జరిపిన ప్రెస్ మీట్‌లో స్పీకర్ కోడెల చేసిన వ్యాఖ్యలను జాతీయ మీడియా వక్రీకరించడానికి మూలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అని చంద్రబాబు అన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని జాతీయ మీడియాకు చెబితే ఆ వార్తలను ఆపేశారని స్పష్టం చేశారు. ఈ రోజు సభలో మంత్రి పుల్లారావు తనపై వచ్చిన ఆరోపణలపై సవాలు విసిరారని, తమ సవాల్‌ను వైసీపీ సభ్యలు స్వీకరిస్తే తాము విచారణ చేపడతామని అన్నారు. తాము వైసీపీకి సవాల్ విసిరిన తర్వాత వారు అసెంబ్లీకి రాలేదని, ఇది పిరికితనమా.. భయపడడమా.. పారిపోవడమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.