: రోజంతా కష్టపడండి.. సాయంత్రం ఇంటికొచ్చి కుటుంబ సభ్యులతో గడపండి: చంద్రబాబు
రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత ఓ గంట కుటుంబ సభ్యులతో గడిపితే ఉండే ఆనందం వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శంషాబాద్ సమీపంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ క్యాంపస్లో మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సానుకూల దృక్పథంతో విజయాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు.
కెరీర్లో ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తే విజయాలు వాటంతట అవే వస్తాయన్నారు. సాధించాలన్న జిజ్ఞాస అలవర్చుకుంటే కొత్త ఆలోచనలు వస్తాయన్నారు. ‘‘కొత్త ప్రపంచంలో అడుగుపెడుతున్న మీరు కొత్త ఆలోచనలతో ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు. వృత్తిలో విజయాలు, సంపదతోపాటు సంతోషమూ ముఖ్యమన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలి. నిజమైన సంతోషం, సంతృప్తి కుటుంబంతోనే వుంటాయి. పొద్దంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులతో గడిపే ఆ ఆనందమే వేరు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇతర దేశాలకు లేని అతి గొప్ప సంస్కృతి, కుటుంబ వ్యవస్థ మనకు ఉన్నాయన్న ముఖ్యమంత్రి కుటుంబాన్ని, పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలని, సామాజిక విలువల్ని కొనసాగించాలని ఉద్బోధించారు.