: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో భారీ ఆధిక్యంతో గెలుపొందిన మాధవ్
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పీవీఎస్ మాధవ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ అభ్యర్థి అజా శర్మపై 9215 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత చతికిల పడింది.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి వైసీపీ మద్దతుతో నిలబడిన పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించి, టీడీపీకి షాక్ ఇవ్వగా, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి గెలుపొందారు. కాగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుంచి బరిలోకి దిగిన మాధవ్ తొలి రౌండు నుంచి ఆధిక్యం కనబరుస్తూనే ఉన్నారు. ఆరో రౌండు కౌంటింగ్ ముగిసే సరికి 5,594 ఓట్ల ఆధిక్యంలో ఉన్న మాధవ్ చివరి రౌండ్ వరకు తన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. చివరికి అజాశర్మపై 9215 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.