: జియోకు షాకిచ్చేందుకు రంగంలోకి దిగుతున్న బీఎస్ఎన్ఎల్... స్పెషల్ ఆఫర్
జియోకు షాకిచ్చేందుకు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రంగంలోకి దిగుతోంది. జియో ఆఫర్ ఈ నెల 31తో ముగియనుండడంతో ప్రైవేటు టెలికాం సంస్థలు వివిధ ఆఫర్లను ప్రకటించాయి. వీటి బాటలో ఆలస్యంగా బీఎస్ఎన్ఎల్ రంగప్రవేశం చేసింది. ఈ మేరకు 339 రూపాయల ప్లాన్ ను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సంజీవ్ త్యాగి మాట్లాడుతూ, ‘‘జియో, ఇతర ప్రైవేటు కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు అత్యంత చవకైన ప్లాన్ ను పరిచయం చేస్తున్నాం. 339 రూపాయల రెంటల్ తో తీసుకొచ్చిన ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను పొందవచ్చు. ఒకనెలలో వినియోగదారులు 30 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు, రోజుకు 25 నిమిషాలపాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 25 నిమిషాలు పూర్తయిన తరువాత నిమిషానికి 25 పైసల చొప్పున లెవీ విధిస్తాం’’ అని అన్నారు. ఈ ఆపర్ ఏప్రిల్ 1 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు.