: గ్యాస్ లీకై మంటలొస్తే ఇలా చేయండి.. అంటూ చూపించిన పోలీసధికారి.. వీడియో వైరల్!
కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టౌలకు స్వస్తి చెప్పి గ్రామీణ ప్రాంతవాసులు కూడా ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్‌ను బాగానే వాడేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఆ గ్యాస్ బండలు పేలిపోతాయని, ఎంతో నష్టం కలుగుతుందని భయపడిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. ఒక వేళ గ్యాస్‌కు మంటలు అంటుకుంటే కంగారులో పరుగులు తీయడం, ఆందోళన పడడం తప్ప వారు ఏమీ చేయలేరు. చిన్న మంట అంటుకున్నా ఏం చేయాలో తెలియకపోవడంతో ఆ ప్రమాదాలు మరింతగా పెరుగుతున్నాయి. మరి వేసవి కాలం వచ్చేసింది. ఈ కాలంలో ఇటువంటి ప్రమాద ఘటనలు ఎక్కువగానే జరిగేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి ప్రమాదం నుంచి ఎలా బయటపడవచ్చో ఢిల్లీకి చెందిన సుశీల్ కుమార్ అనే పోలీసు అధికారి ఓ మాక్‌డ్రిల్ చేసి చూపించారు. అనంతరం ఈ వీడియోను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
జన సమూహం ఓ చోట చేరి ఉండగా వారి మధ్యలో గ్యాస్ బండ పెట్టి దానిని ఆయనే లీక్ చేసి నిప్పంటించి అనంతరం తేలికగా ఆర్పేసి ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. గ్యాస్ లీక్ అవగానే కంగారు పడిపోకూడదని, దానిపై తడిబట్టను కప్పితే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. ఓ తడిపిన వస్త్రాన్ని ఉపయోగించి ఆయన ఈ ప్రయోగం చేసి చూపించారు. గ్యాస్ లీకవ్వగానే అది మండటానికి ఆక్సిజన్ సహకరిస్తుందని, అది అందకుండా చేస్తే గ్యాస్ మంటను ఆర్పేయవచ్చని చెప్పారు. అందుకు తడిసిన వస్త్రాన్ని తీసుకొని మండుతున్న గ్యాస్ సిలిండర్‌పై పూర్తిగా కప్పివేస్తే వెంటనే ఆ మంట ఆరిపోతుందని ప్రజలకు చూపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆయన అవగాహన కార్యక్రమాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియోని ఇప్పటికి 60 లక్షలమంది చూడడం విశేషం. ఈ పోస్టుని 2,34,834 ఫేస్ బుక్ యూజర్లు షేర్లు చేశారు. మంచి వీడియోలను కూడా ఇంతమంది చూస్తారని ఆ పోలీసు అధికారి నిరూపించారు. ఈ వీడియోను మీరూ చూసి అవగాహన పొందండి...