: సభకు రారా? కనీస బాధ్యత లేదా?: బీజేపీ ఎంపీలపై మోదీ ఆగ్రహం
ఈ ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో అత్యధిక బీజేపీ ఎంపీలు గైర్హాజరు కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సభలో చాలినంత కోరం లేక పార్లమెంట్ కార్యకలాపాలు ఆలస్యంగా ప్రారంభం కాగా, ఎంపీలంతా పార్లమెంటుకు రావడం కనీస బాధ్యతని, సభ్యులంతా విధిగా రావాలని, తాను ఎవరిని ఏ సమయంలోనైనా పిలుస్తానని, రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పార్లమెంటుకు వస్తే ఎన్నో మంచి పనులు చేయవచ్చని, సభకే రాకుంటే అభివృద్ధి కుంటుపడుతుందని హితవు పలికారు. నిన్న కూడా సభ్యుల సంఖ్య సరిపోక సభ ఆలస్యం అయిందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ప్రధాని దృష్టికి తీసుకువెళ్లగా, ఎవరెవరు వచ్చారన్న విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. రానివారి జాబితాను తీసుకున్నారు. సభ్యుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన, బీజేపీ ఎంపీలంతా తనకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.