: యూఎస్ ఎయిర్ పోర్టులో రిటైర్డ్ పోలీస్ చీఫ్ కు అవమానం!
అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పౌరులకు కూడా తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పటికే పలు విమానాశ్రయాల్లో ఎంతో మందిని అధికారులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, తన జీవితాంతం అమెరికాకు సేవలందించిన, మాజీ పోలీసు ఉన్నతోద్యోగికి ఇటువంటి అనుభవమే ఎదురైంది. నార్త్ కరోలినా పోలీస్ చీఫ్ గా, వర్జీనియా డిప్యూటీ పోలీస్ చీఫ్ గా సేవలందించిన హసన్ ఆడెన్ ను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. పారిస్ ట్రిప్ ముగించుకుని న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టిన ఆయన పేరులో హసన్ అన్న పదం ఉండటంతో ఆపి ప్రశ్నించారు.
గడచిన 42 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న హసన్ ఆడెన్ కు యూఎస్ పాస్ పోర్టుతో పాటు టీఎస్ఏ ముందస్తు చెకింగ్ అనుమతులూ ఉన్నాయి. పదుల సార్లు ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లివచ్చారు. తనకు ఎదురైన అనుభవాన్ని గురించి ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో తెలుపుతూ, ఇలాంటి ఓ పరిస్థితి తన ముందుకు వస్తుందని అనుకోలేదని చెప్పారు. 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్న తన తల్లి దగ్గరకు తాను వెళ్లి వచ్చానని, తనను ఓ రూములో ఉంచి తాళం వేశారని, ఆపై అధికారులు ఎన్నో ప్రశ్నలు సంధించారని చెప్పారు. తాను వైట్ హౌస్ లో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యానని, జాతీయ పోలీస్ విధానం, సంస్కరణల్లో సలహాలు, సూచనలు ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఈ తరహా చట్టాలు ఎవరికీ క్షేమకరం కాదని అభిప్రాయపడ్డారు.