: పన్నీర్ సెల్వం దూకుడు.. శశికళ బంధువు దినకరన్ కలవరం!


అక్రమాస్తుల కేసులో తాను జైల్లో ఉన్నప్పటికీ... తన నమ్మిన బంటు పళనిస్వామి తనకు అనుగుణంగా పాలన కొనసాగిస్తాడనే భావనతో చిన్నమ్మ శశికళ ఆయనను సీఎం చేశారు. అయితే, ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన వెంటనే పరిపాలనలో పళని తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. పాలనలో ఎక్కడా శశికళ ముద్ర లేకుండా ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దూకుడుగా ముందుకు సాగుతున్నారు. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో బలమైన నేత మధుసూదనన్ ను పన్నీర్ బరిలోకి దింపుతున్నారు. ఆర్కే నగర్ ఓటర్లకు మధుసూదనన్ సుపరిచితుడే. గతంలో ఒకసారి ఆయన ఇక్కడ నుంచే గెలుపొందారు. నియోజకవర్గంలోని ప్రతి వీధి, ప్రతి నాయకుడు మధుసూదనన్ కు తెలుసు. అంతే  కాదు, ఇప్పటికే ఆయన ఆ నియోజకవర్గంలోని ప్రతి నేతను టచ్ చేస్తున్నారు. వారి ఇంటికి వెళ్లి మరీ పలకరించి వస్తున్నారు. ఇది దినకరన్ ను కలవరపెడుతోంది.

శశికళ అక్క కుమారుడు దినకరన్ అన్నాడీఎంకే తరపున ఇక్కడ పోటీ చేస్తున్నారు. అయితే, నేతలంతా పన్నీర్ వైపుకు వెళ్లినా, కార్యకర్తలు మాత్రం తమకు అండగా ఉంటారనే ధీమాతో దినకరన్ ఉన్నారు. కార్యకర్తలతో దినకరన్ రహస్య మంతనాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు, జయ మేనకోడలు దీప కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటం దినకరన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకవేళ వీరి ముగ్గురి మధ్య ఓట్లు చీలిపోతే... అంతిమంగా డీఎంకే ఘన విజయం సాధించే అవకాశాలు కూడా లేకపోలేదు. 

  • Loading...

More Telugu News