: భక్తుల ముఖాలపై స్ప్రే కొట్టే వివాదాస్పద ప్రవక్త లిథేబో భవితవ్యం నేడు తేలనుంది!
అన్ని రోగాలనూ నయం చేస్తానంటూ నమ్మబలుకుతూ ఇంట్లో కీటకాలను చంపడానికి ఉపయోగించే విషపూరితమైన స్ప్రేలను తన వద్దకు వచ్చిన భక్తుల కళ్లు, ముఖాలపై కొట్టే దక్షిణాఫ్రికాకు చెందిన వివాదాస్పద ప్రవక్త లిథేబో రబాలగో భవితవ్యం ఈ రోజు తేలనుంది. ఆ ప్రవక్త చేస్తోన్న ఈ చర్యలను ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ లింపోపో ప్రావిన్స్ ఆరోగ్య శాఖ విభాగం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ స్ప్రేలను ఉపయోగించకూడదని చెబుతూ లిథేబో రబాలగోకు ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. ఈ రోజు కోర్టులో హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో ఆయనకు కోర్టు ఏదైనా శిక్ష విధిస్తుందా? అన్న అంశంపై ఆ దేశంలో ఆసక్తి నెలకొంది.
లిథేబో రబాలగో తనకు అతీత శక్తులున్నాయని ప్రచారం చేసుకుంటూ ఎయిడ్స్, క్యాన్సర్లతో పాటూ ఎన్నో జబ్బులను నయం చేస్తానని చెబుతూ ఈ చర్యలకు పాల్పడ్డాడు. దీంతో అతను ఒక్కసారిగా అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచాడు. అతడి బాగోతంపై దక్షిణాఫ్రికా ప్రముఖ నటి బోయిటీ తులో స్పందిస్తూ... ఈ సంఘటన చూస్తుంటే తన గుండె పగిలిపోయిందని విచారం వ్యక్తం చేసింది.