: రాజ్ నాథ్ సింగ్ కుమారుడికి షాక్.. కేబినేట్ లో చోటు దక్కలేదు!
కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినేట్ లో 46 మంది స్థానం దక్కించుకున్నారు. అయితే, పంకజ్ సింగ్ కు మాత్రం బెర్త్ దక్కలేదు. తనకు మంత్రి పదవి దక్కుతుందని పంకజ్ సింగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ... పార్టీ పెద్దలు ఆయనకు అవకాశం కల్పించలేదు. దీంతో, ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మనవడికి, బీజేపీ సీనియర్ నేత లాల్జీ టాండన్ కుమారుడికి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదు.
యూపీ కేబినెట్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సన్నిహితులకే పెద్దపీట దక్కింది. అయనకు విశ్వాసపాత్రులుగా ముద్రపడ్డ వారికి పదవులు దక్కాయి. ఇదే సమయంలో కుల, సామాజిక సమీకరణల సమతుల్యాన్ని కూడా పాటించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, కేబినెట్ లో స్థానం సంపాదించుకున్న వారిలో 13 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.