: నాపై కులం ముద్ర వేసి, వేధిస్తున్నారు.. రాజకీయాల నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతోంది: రోజా
తనను అసెంబ్లీ నుంచి మరో ఏడాది పాటు సస్పెండ్ చేస్తే, న్యాయ పోరాటం చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. తనను రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో బయటకు పంపే కుట్రలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కులం ముద్ర వేసి, వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. తనకు జరుగుతున్నంత అన్యాయం మరే ఇతర మహిళా ఎమ్మెల్యేకు జరగలేదని వాపోయారు. తాను అనని మాటలను కూడా అన్నట్టుగా వీడియోలో మార్ఫింగ్ చేసి చూపించారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే అనితను తాను ఎన్నడూ దూషించలేదని చెప్పారు. తాను ఏ తప్పూ చేయనందున, అనితకు క్షమాపణ చెప్పే అవసరమే లేదని... క్షమాపణ చెప్పనని తేల్చి చెప్పారు.
మరోవైపు, రోజాను సస్పెండ్ చేయాలంటూ ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఈ రోజు శాసనసభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అనితకు రోజా క్షమాపణ చెప్పలేదని, అందువల్ల క్రమశిక్షణా చర్యల కింద రోజాను మరో ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే.