: శశికళ శిబిరంలో దడ పుట్టిస్తున్న సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్


అన్నాడీఎంకే సూళూరు ఎమ్మెల్యే కనకరాజ్ చిన్నమ్మ శశికళ శిబిరంలో దడపుట్టిస్తున్నారు. పది రోజుల్లో న్యాయం జరగకుంటే శిబిరం మారతానంటూ ఆయన చేస్తున్న హెచ్చరికలతో శశికళ శిబిరంలో కలవరం మొదలైంది. కనకరాజ్ బెదిరింపులకు సూళూరు పచ్చపాళయంలోని క్వారీలో జరిగిన ప్రమాదమే కారణమని తెలుస్తోంది. శుక్రవారం జరిగిన క్వారీ ప్రమాదంలో పళనికి చెందిన బాలన్, శక్తివేలన్ అనే ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స  పొందుతూ వీరు మరణించారు.

బాధిత కార్మిక కుటుంబాలకు క్వారీ యాజమాన్యం రూ.3 లక్షల చొప్పున ముట్టజెప్పి చేతులు దులుపుకుంది. కనకరాజ్‌కు ఇది తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆదివారం క్వారీ పరిసరాల్లో పర్యటించిన ఆయన క్వారీ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్వారీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి  పళనిస్వామికి కూడా తను భయపడే రకం కాదని, పది రోజుల్లో బాధితులకు న్యాయం జరగకుంటే శిబిరం నుంచి బయటకు వెళ్లిపోతానని అల్టిమేటం జారీచేశారు.

కనకరాజ్ హెచ్చరికలతో శశికళ వర్గంలో గుబులు మొదలైంది. ప్రస్తుతం పళనిస్వామి సర్కారుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వీరిలో ఐదుగురు జారుకుంటే ప్రభుత్వం కుప్పకూలుతుంది. దీనిని ఆసరాగా చేసుకుంటున్న ఎమ్మెల్యేలు తరచూ అధిష్ఠానాన్ని బెదిరిస్తున్నారు. ఫలితంగా వారిని బుజ్జగిస్తూ వారి డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తున్నట్టు సమాచారం. తాజాగా కనకరాజ్ బెదిరింపులకు దిగడంతో ‘చిన్నమ్మ’ శిబిరంలో కలవరం మొదలైంది. మరోవైపు అధిష్ఠానంపై ఎదురుదాడికి దిగిన కనకరాజ్‌ను తమవైపు లాక్కునేందుకు పన్నీర్ సెల్వం వర్గం పావులు కదుపుతోంది.  

  • Loading...

More Telugu News