: కడపలో ఉత్కంఠ.. జగన్‌కు నిద్రను దూరం చేస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలు!
కడప ఎమ్మెల్సీ ఎన్నికలు అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేడు (సోమవారం) ఫలితాలు వెలువడనుండడంతో రాజకీయ నాయకుల దృష్టి అటువైపు మళ్లింది. టీడీపీ గెలుపుపై ధీమాగా ఉండగా వైసీపీ క్రాస్ ఓటింగ్‌ను నమ్ముకుంది. ఎమ్మెల్సీ స్థానం కోసం వైసీపీ తరపున పోటీ పడిన వైఎస్ వివేకానందరెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు సోదరుడు. సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి. 1981లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీగానూ ఎన్నికయ్యారు. వైఎస్ మరణానంతరం జగన్ వైసీపీని ఏర్పాటు చేసినా ఆయన మాత్రం కాంగ్రెస్‌ను వీడలేదు. 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో వ్యవసాయమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరారు. ఇప్పుడు జగన్ ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు.
టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి అలియాస్ బీటెక్ రవి రెండు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నారు. కర్ణాటకలో బీటెక్ పూర్తిచేసిన ఆయన 2011లో జరిగిన ఉప ఎన్నికలో పులివెందుల నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాల కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ ఎదురుచూస్తున్నాయి. కాగా ఈ ఎన్నిక వైసీపీ చీఫ్ జగన్‌కు సవాలుగా మారడంతో ఆయనకు కంటిమీద కనుకు కరువైంది. కడప జిల్లాలో వైసీపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవాలంటే వివేకానందరెడ్డి గెలుపు చాలా అవసరం. మరోవైపు చంద్రబాబు ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 839 ఓట్లు పోలవగా, బీటెక్ రవికి 449 ఓట్లు, వివేకాకు 390 ఓట్లు పడినట్టు టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వైసీపీ క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకుంది. టీడీపీలో ఉన్న వైఎస్ అభిమానులు తమకే ఓటు వేసుంటారని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కోడ్ విధానాన్ని అవలంబించి ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా చూసుకుంది. ఫలితంగా క్రాస్ ఓటింగ్‌ను నిలువరించినట్టు చెబుతోంది. దీంతో ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరు గెలిచినా ఓట్ల తేడా పది నుంచి 20 మధ్యే ఉంటుందని చెబుతున్నారు. వైసీపీ కనుక ఇక్కడ ఓడిపోతే జిల్లా రాజకీయం ఆసక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు. వైఎస్ కుటుంబాన్ని ఓడించి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న టీడీపీ ఆశలు నెరవేరుతాయో? లేదో? చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.