: బాచుపల్లి శ్రీ చైతన్య విద్యార్థుల వీరంగం... ఉద్రిక్తత!
హైదరాబాద్ శివార్లలోని శ్రీ చైతన్య కళాశాల విద్యార్థులు గత అర్ధరాత్రి రహదారులపై వీరంగం సృష్టించడంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. కళాశాలలో ఏం జరిగిందన్న విషయం బయటకు రాలేదుగానీ, వందలాది మంది విద్యార్థులు ప్రిన్సిపాల్ తో పాటు, ఆయనకు సహాయకుడిగా ఉన్న సెక్యూరిటీ గార్డును చితకబాదారు. ఆపై రోడ్లమీదికి వచ్చి రణరంగం చేశారు. రోడ్డుపై వెళుతున్న బస్సుపై దాడి చేశారు. దాని అద్దాలను పగులగొట్టారు. ఆ దారిలో వెళుతున్న ఇతర వాహనాలపైనా దాడికి దిగారు. పోలీసులు వచ్చి విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం చేయగా, కానిస్టేబుల్ పైనా దాడికి దిగారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడికి భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ఈ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించామని ఏసీపీ వెల్లడించారు.