: స్టార్‌హోటల్‌లో ఎంజాయ్ చేశాడు.. బిల్లడిగితే 'దొంగ'కారిచ్చి తుర్రుమన్నాడు!


స్టార్ హోటల్‌లో దిగి మూడు రోజులపాటు ఎంజాయ్ చేసిన ఓ యువకుడు బిల్లు అడిగితే తాను దొంగిలించుకుని వచ్చిన కారు అప్పజెప్పి పరారయ్యాడు. హైదరాబాద్‌లోని సోమాజీగూడలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్రకు చెందిన కృష్ణ చైతన్య ఈనెల 8న ఇన్నోవా కారులో సోమాజీగూడలోని ‘ది పార్క్’ హోటల్‌కు వచ్చాడు. తాను క్లాస్-1 కాంట్రాక్టర్‌నని, జెడ్పీ చైర్మన్ బావమరిదినని పరిచయం చేసుకుని రూమ్ తీసుకున్నాడు. కారు డ్రైవర్ భరత్ కౌటిల్యతో కలిసి మూడు రోజుల పాటు హోటల్‌లో జల్సా చేశాడు. ఫిబ్రవరి 10న గది ఖాళీ చేస్తున్నట్టు చెప్పడంతో హోటల్ సిబ్బంది రూ.3.66 లక్షల బిల్లును అతడి చేతిలో పెట్టారు. ప్రస్తుతం తనవద్ద డబ్బులు లేవని, రెండు రోజుల్లో చెల్లిస్తానని, అప్పటి వరకు ఈ కారును ఉంచుకోవాలంటూ ఇన్నోవా తాళాలు ఇచ్చి వెళ్లిపోయాడు. అయితే రోజులు గడుస్తున్నా బిల్లు చెల్లించేందుకు కృష్ణచైతన్య రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది ఫోన్ చేయగా రేపు, ఎల్లుండి అంటూ పది రోజులు దాటవేశాడు. చివరికి ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు.

కాగా, రెండు రోజుల క్రితం ముంబైకి చెందిన గ్రావిటీ మోటార్ ట్రావెల్స్ ప్రతినిధులు హోటల్‌కు వచ్చారు. కృష్ణ చైతన్య ఆరు నెలల క్రితం తమ వద్ద కారు అద్దెకు తీసుకున్నాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని చెప్పారు. తమకు రూ.2.5 లక్షల బాకీ ఉన్నాడని, ఈ హోటల్‌లో ఉన్నాడని తెలిసి వచ్చామని పేర్కొనడంతో హోటల్ యాజమాన్యం షాక్‌కు గురైంది. తమకారు తమకు ఇచ్చేయాలని ట్రావెల్స్ ప్రతినిధులు కోరారు. అయితే బిల్లు చెల్లిస్తేనే కారు ఇస్తామని వారు తెగేసి చెప్పారు. మోసపోయామని గుర్తించిన హోటల్ సిబ్బంది కృష్ణ చైతన్యపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News