: 360 పరుగుల వద్ద మూడో రోజు ఆట ముగించిన భారత్!


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జార్ఖాండ్ లోని రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. ఆటముగిసే సమయానికి భారత జట్టు 130 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. 120/1 ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆచితూచి ఆడింది. భారత్ పై ఎలాగైనా గెలిచి తీరాలన్న లక్ష్యంతో ఆసీస్ ఆటగాళ్లు బంతులు వేయగా, భారత బ్యాట్స్ మన్ నిబ్బరంగా ఆడారు. ఈ క్రమంలో ఓపెనర్ మురళీ విజయ్ (84) సెంచరీకి చేరువవుతున్న దశలో అవుటై నిరాశగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (6) దారుణంగా విఫలమయ్యాడు. అనంతరం వచ్చిన అజింక్యా రహానే (14) ను కూడా పాట్ కమ్మిన్స్ పెవిలియన్ కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కరుణ్ నాయర్ (23) ఆశించిన స్థాయిలో రాణించలేదు.

దీంతో బ్యాటింగ్ కు వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (3) నిరాశపరిచాడు. తరువాత క్రీజులోకి వచ్చిన సాహా (18) ఆకట్టుకున్నాడు. సెంచరీతో సత్తాచాటి, సహచరులు వెనుదిరుగుతున్నా ఏమాత్రం అలసట లేకుండా రోజంతా ఆడిన చటేశ్వర్ పుజారా (130)కు అండగా నిలిచాడు. దీంతో టీమిండియా 130 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. ఆసీస్ కంటే ఇంకా 91 పరుగులు వెనుకబడి ఉండగా, భారత్ చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. ఇంకా రెండు రోజుల మ్యాచ్ మిగిలి ఉంది. ఆసీస్ ఆటగాళ్లలో పాట్ కమ్మిన్స్ నాలుగు వికెట్లతో రాణించగా, హేజిల్ వుడ్, ఒకీఫ్ చెరొక వికెట్ తీసి అతనికి చక్కని సహకారమందించారు. 

  • Loading...

More Telugu News